ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం
ఏపీలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
ఏపీలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిగువ ట్రోపో ప్రాంతంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో ఈరోజు ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల, ఆదివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా వెలివాడలో 9.8 సెం.మీ.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 8.5, సంతబొమ్మాళిలో 7.9, గరికిపాలెంలో 7.1, తులుగులో 6.8, ఎచ్చెర్లలో 6.3, గొట్టా బ్యారేజి వద్ద 6.1, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 6.2, విజయనగరంలో 5.3, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 4.6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.