Tue Mar 25 2025 04:08:00 GMT+0000 (Coordinated Universal Time)
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
కాగా.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది శ్రీలంక తీరానికి పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి సోమవారం ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వచ్చింది. ఈ అల్పపీడన ప్రభావంతో.. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మాండూస్ తుపాను మిగిల్చిన నష్టాల నుండి పూర్తిగా తేరుకోకుండానే.. మరోమారు వర్షాలు పడటంతో.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వల్పంగా పంట నష్టం వాటిల్లిందని వాపోయారు.
కాగా.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కోస్తా, యానాం లలోని వివిధ ప్రాంతాల్లో.. సోమ, మంగళ, బుధవారాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే.. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాయలసీమలో సోమ, మంగళ, బుధవారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
Next Story