Sat Nov 23 2024 01:38:23 GMT+0000 (Coordinated Universal Time)
కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వారంరోజులు వర్షసూచన
నేడు కూడా కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు..
తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా భానుడి భగభగల నుండి ఉపశమనం లభించినా.. రైతులకు మాత్రం తీరని పంటనష్టం వాటిల్లింది. వడగండ్లు, భారీ వర్షాలకు మరికొద్దిరోజుల్లో చేతికి అందివస్తుందనుకున్న పంట..వర్షార్పణం అయింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా తడిసిపోవడంతో.. రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో వారంరోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో నేడు కూడా కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. విదర్భ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి తూర్పు దిశకు పయనించే క్రమంలో రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ద్రోణి కోస్తాపైకి వస్తుందని, ఆ తర్వాత నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. ఏప్రిల్ 30 నుండి మే 3,4 తేదీల వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. వారంరోజులపాటు వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
Next Story