Mon Dec 23 2024 08:14:39 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణకోస్తా , రాయలసీమకు వాయుగుండం ముప్పు
వాయుగుండం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, 6వ తేదీ వరకూ..
విశాఖపట్నం : దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని, జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. నిన్న మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రికోమలైకి 360, తమిళనాడులోని నాగపట్నానికి 700, చెన్నైకి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది.
Also Read : హెవీ రెస్పాన్స్.. మూడురోజుల్లో 39 కోట్లు
వాయుగుండం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, 6వ తేదీ వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖలు హెచ్చరించాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Next Story