Sun Dec 22 2024 16:45:01 GMT+0000 (Coordinated Universal Time)
TTD Board : టీటీడీ బోర్డు నియామకంలో జాప్యం అందుకేనట?
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ నియామకంలో ఆలస్యానికి కారణం లడ్డూ వివాదమేనంటున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ నియామకంలో ఆలస్యానికి కారణం లడ్డూ వివాదమేనంటున్నారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే టీటీడీ బోర్డును వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే టీటీడీ బోర్డు ప్రకటించేలోగా లడ్డూ వివాదం చుట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా లడ్డూ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని, దీనిప స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన తర్వాత టీటీడీ బోర్డు నియామకం ప్రతిపాదన కొంత వెనక్కు వెళ్లినట్లు కనిపిస్తుంది.
అనేక ప్రచారాలు జరిగినా...
టీటీడీ బోర్డు ఛైర్మన్ గా మంచి వారిని నియమిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే బోర్డు నియామకంలో ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేలా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. టీటీడీ బోర్డు ఛైర్మన్, సభ్యులుగా నియామకం చేపట్టాలంటే వారి ట్రాక్ రికార్డును కూడా చంద్రబాబు పరిశీలించాలని నిర్ణయించారు. అందుకోసం ఆయన కసరత్తు మళ్లీ మొదటికి వచ్చిందని చెబుతున్నారు. గతంలో వినిపించిన పేర్లను కూడా ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారి బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఇతర విషయాలపై కూడా ఆరా తీయాలని ఇప్పటికే ఇంటలిజెన్స్ శాఖకు బాధ్యతలను అప్పగించినట్లు చెబుతున్నారు.
ఇంటలిజెన్స్ నివేదికల తర్వాతే....
సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీటీడీ సభ్యులుగా తీసుకుంటారు. అందుకోసమే కూలకంషకంగా వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏ మాత్రం తేడా ఉన్నా ఎన్ని సిఫార్సులు వచ్చినా పట్టించుకోకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. లడ్డూ వివాదం నేపథ్యంలోనే అన్ని రకాల జాగ్రత్తలు టీటీడీ బోర్డు నియామకంలో చేపట్టాలని నిర్ణయించారు. నియామకం చేపట్టిన తర్వాత ఛైర్మన్, సభ్యుల మీద వచ్చే ఆరోపణలు ప్రభుత్వ పరువును తీస్తాయని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే దసరా బ్రహ్మోత్సవాలకు ముందే బోర్డును నియమించాలనుకున్నప్పటికీ, అందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినప్పటికీ పెండింగ్ లో పెట్టినట్లు తెలిసింది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే టీటీడీ బోర్డును ప్రకటించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story