Thu Dec 26 2024 01:37:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జార్ఖండ్ ఫలితాలు జగన్ కు కలసి వస్తాయా?
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. బీజేపీతో కలసి ఉంటేనే విజయం దక్కుతుందన్న ఒక భావన ఏపీ రాజకీయ పార్టీల్లో బలపడి పోయే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే హర్యానాతో పాటు వరసగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడంతో మోదీ తోడుంటే విజయం మనదే నన్న ధీమా బలపడి పోతుంది. మోదీ చరిష్మా కావచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాష్ట్రానికి అందుతుందన్న భావన కావచ్చు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని అనుకుని కమలం పార్టీ ఉన్న వైపు జనం మొగ్గు చూపుతారన్నది ఈ ఎన్నికలు స్పష్టమవుతున్నాయి.
పార్టీని చీల్చినా...
మహారాష్ట్రలో పార్టీని చీల్చినా జనం కమలం కూటమికే జై కొట్టారు. ఇటు శివసేన, అటు పవార్ పార్టీ ఎన్సీపీని చీల్చినా సరే జనం మాత్రం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపడంతో అంటే ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకున్నారన్నమాట. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కోలుకునే అవకాశం లేకపోవడంతో పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్సలు లేకపోవడం కూడా బీజేపీ వైపు రాజకీయ పార్టీలు మొగ్గు చూపే అవకాశముంది. మోదీపై పెరిగిన నమ్మకంతో పాటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో పనిచేస్తాయని ప్రజలు నమ్మే అవకాశాలున్నాయని భావించి ప్రజలు ఓట్లేసే అవకాశముందని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లోనూ అంచనాకు వచ్చే అవకాశముంది.
బీజేపీతో పొత్తు కోసం...
మరోవైపు గత ఎన్నికల్లోనే కాకుండా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా అధికారంలోకి రావడం కూడా ఈ ఆలోచనకు కొంత కలసి వస్తుంది. బీజేపీతో కలసి వెళితే మైనారిటీలు వ్యతిరేకమవుతారన్న భయం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో లేదు. దీనికి కారణం 2024 లో ఏపీ లో జరిగిన ఎన్నికల్లోనూ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమి పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో జగన్ కూడా ఎప్పటి నుంచో బీజేపీతో కయ్యానికి దిగడం లేదు. సఖ్యతగానే వెళుతున్నారు. అయితే జగన్ పార్టీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు. ఏదైనా టీడీపీతో తేడా వస్తే ఈసారి జగన్ కూడా బీజేపీతో కలసి దిగడానికి సిద్ధపడతారనడానికి ఎటువంటి సందేహం లేదు.
అరెస్టయిన తర్వాతే...
మరోవైపు జార్ఖండ్, గతంలో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే పార్టీ అధినేతలను అరెస్ట్ చేస్తే అధికారం గ్యారంటీ అన్నది బాగా బలపడిపోయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ జరిగిన తర్వాతే రెండోసారి సీఎం పీఠం పై కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత జగన్ ను కూడా ఏదో కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతల వాయిస్ మారిపోయినట్లే కనిపిస్తుంది. జగన్ ను ఏ కేసులో అరెస్ట్ చేసినా అది సానుభూతిగా మారి వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశముందన్న ఆలోచన కూటమి పార్టీల్లో బయలుదేరింది. అందుకే జగన్ కు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఒకరకంగా జైలుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తాయనే భావించాలి.
Next Story