Mon Dec 23 2024 14:13:26 GMT+0000 (Coordinated Universal Time)
బండారు వ్యాఖ్యలపై మొదటిసారి స్పందించిన మంత్రి రోజా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. పలువురు వైసీపీ నేతలు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్స్టేషన్లో బండారుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా పోలీసులు మోహరించారు. బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వెన్నెలపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు సరైన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, టీడీపీ నేతలు సంస్కారం లేకుండా, మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి న్యాయస్థానం తగిన శిక్ష విధిస్తుందని అన్నారు. చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి అని.. గాంధీని అవమానించేందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు.
Next Story