Mon Dec 23 2024 01:05:36 GMT+0000 (Coordinated Universal Time)
వారి వల్లే అమలాపురంలో అల్లర్లు
పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై 307,143,144,147,148,151,152, 332
అమలాపురం : కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు స్పందించారు. అల్లర్లలో పాలుపంచుకున్న వారిలో ఇప్పటిదాకా 19 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అంతేకాకుండా అమలాపురం అల్లర్లకు రౌడీ షీటర్లే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. అల్లర్లలో పాల్గొన్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తామని తెలిపారు. అరెస్టులు ముగిశాక దశలవారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని పాలరాజు చెప్పారు.
పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం వజ్ర పోలీస్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్ర వంతెన దగ్గర బస్సును దగ్ధం చేసిన కేసులో మరికొందరిపై అమలాపురం పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. 341,143,144,147, 148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో ఈ ఎఫ్ఐఆర్ను ఫైల్ చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసిన జాబితాలో బీజేపీ జిల్లా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, కాపు ఉద్యమ నేత నల్ల చంద్రరావు కుమారుడు అన్యం సాయి కూడా ఉన్నారు. ఈదరపల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై కేసు నమోదైంది.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలంటూ జిల్లాకు చెందిన దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో జిల్లా పేరును మార్చొద్దంటూ అన్యం సాయి ఆందోళనకు దిగాడు. జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేతబట్టిన అన్యం సాయి వీడియోలు ప్రస్తుతం న్యూస్ ఛానెళ్లలో వైరల్ అవుతున్నాయి. సాయి అమలాపురం అల్లర్లకు నేతృత్వం వహించాడంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story