Mon Dec 23 2024 06:14:30 GMT+0000 (Coordinated Universal Time)
రుయాలో దారుణం..మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రూ.10వేలు డిమాండ్ !
అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో..
తిరుపతి : తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ల దందా మితిమీరిపోయింది. అప్పటికే కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రిని.. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించేందుకు 90 కిలోమీటర్లకు రూ.10 వేలు డిమాండ్ చేశారు రుయా అంబులెన్స్ డ్రైవర్లు. అంతేకాక.. ఉచిత అంబులెన్స్ వచ్చినా ఆ డ్రైవర్ ను బెదిరించి, తన్ని తరిమేశారు. అంబులెన్స్ డ్రైవర్లు అడిగినంత డబ్బు కట్టలేక.. వేరే దారిలేక.. కన్నకొడుకు మృతదేహాన్ని విషణ్ణ వదనంతోనే బైకుపై తీసుకెళ్లాల్సిన దుస్థితి కలిగింది ఆ తండ్రికి.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతిని, నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు. కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.10 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో అంత డబ్బివ్వడం తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. గ్రామంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పడంతో.. ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు.
ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్సు డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు కొట్టి, బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరదీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక తన బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రుయా అంబులెన్స్ డ్రైవర్లు ఇలాగే ప్రవర్తించారని, అయినప్పటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
Next Story