Wed Mar 26 2025 17:23:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఇంత రద్దీ ఏంటి సామి?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ వారం ఆరంభంలో సోమవారం మాత్రం కొంత భక్తుల సంఖ్య తగ్గినట్లు కనిపించినా తర్వాత మంగళవారం నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఇక మరో మూడు రోజుల పాటు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్ర,శని, ఆదివారాల్లో ఎటూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ వారం దాదాపు భక్తుల రాక రోజురోజుకు ఎక్కువవుతుంది.
వేసవి రాకముందే...
ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు వస్తుండగా, మళ్లీ వేసవి వస్తే రద్దీ మరింత పెరుగుతుందని కొందరు ముందే వచ్చి ఏడుకొండలవాడి చెంత తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనికి తోడు రోజువారీగా ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటం కూడా టోకెన్లు దొరుకుతాయని భావించి అప్పటికప్పుడు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే కనపడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో కి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,745 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,156 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story