Tue Apr 22 2025 17:45:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఇంత పెరగడానికి రీజన్ ఇదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నెలలో సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కిటకిటలాడుతున్న తిరుమల...
తిరుమలకు ఒక్కసారిగా భక్తులు రావడంతో స్వామి వారి చెంత గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇటు లడ్డూ కౌంటర్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రం వద్ద కూడా భక్తులు బారులు తీరారు. తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లడ్డూల తయారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పెంచారు. రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లు మంజూరు చేస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు.
21 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లకోసం క్యూ లో నిల్చున్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,110 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story