Thu Dec 26 2024 16:32:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గని రష్.. హుండీ ఆదాయం మాత్రం రికార్డు బ్రేక్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా అధిక సంఖ్యలోనే భక్తులు తిరుమలలో ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా అధిక సంఖ్యలోనే భక్తులు తిరుమలలో ఉన్నారు. స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సాధారణంగా వారం ప్రారంభంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అందులోనూ మంగళవారం వంటి రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం లేదని అధికారులు కూడా భావిస్తారు. కానీ మంగళవారం మాత్రం రద్దీ పెరగడంపై మాత్రం అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ దేశ యాత్ర టూర్ కు వెళుతున్న భక్తులంతా తిరుమలకు చేరుకోవడంతో రద్దీ పెరిగిందని అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భక్తులు ఎంత మంది వచ్చినప్పటికీ వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, వసతి, అన్న ప్రసాదం వంటి విషయాల్లో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
24 కంపార్ట్మెంట్లలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,728 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,611 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story