Fri Nov 22 2024 19:56:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శుక్రవారం తిరుమలలో రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో రద్దీ మరింత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా దుర్లభంగా మారడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం వచ్చిన వారు శనివారం కూడా ఉండి స్వామి వారిని దర్శించుకుని వెళ్లాలన్న కోరికతో గదుల వద్ద గంటల తరబడి భక్తులు కుటుంబాలతో సహా వెయిట్ చేయాల్సి వస్తుంది. గది ఖాళీ అయిన వెంటనే ముందు వచ్చిన వారి ప్రకారం గదులను కేటాయిస్తున్నారు. కొందరు ఆన్ లైన్ లో ముందుగానే వసతి గృహాలను బుక్ చేసుకోవడంతో కొందరు బయటే ఉంటున్నారు. తిరుమలలో గడిచిన కొద్ది రోజుల నుంచి విపరీతమైన రద్దీ నెలకొంది. భక్తులతో కిక్కిరిసి పోయింది.
అన్ని కంపార్ట్మెంట్లు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల క్యూ లైన్ టీబీసీ వరకూ విస్తరించి ఉంది. దీంతో శ్రీవారి సేవకులు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లోని భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,529 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,730 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story