Tue Dec 03 2024 17:53:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వరస సెలవులతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నేడు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో పాటు సెలవు దినం రావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వీవీఐపీలు కూడా ఎక్కువ మంది వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక తిరుపతి స్థానికులు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వసతి గృహాలు దొరకకపోయినా నేరుగా స్వామి వారిని దర్శించుకుని భక్తులు వెళ్లిపోతున్నారని అధికారులు తెలిపారు.
26 కంపార్ట్మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,967 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,421 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.26 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Next Story