Thu Dec 26 2024 16:03:22 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ మంగళవారం కూడా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో మంగళవారం కూడా భక్తులతో వీధులు కిటకిటలాడుతున్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో మంగళవారం కూడా భక్తులతో తిరుమల వీధులు కిటకిటలాడుతున్నాయి. గత ఐదు రోజుల నుంచి ఇదే పరిస్థితి. వరస సెలవులు రావడం ఇందుకు కారణమయితే శ్రావణమాసం ముగుస్తున్న సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోతున్నాయి. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సత్రంలోకి కూడా పెద్ద క్యూ ఉంటుంది. భక్తులు అన్న ప్రసాదం కోసం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు కొంత రద్దీ తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇరవై గంటలు...
తిరుమలలో భక్తుల రద్దీ గతంలో ఎప్పుడూ ఇంత లేదని సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల స్వామి వారి ఆదాయం పెరగడమే కాకుండా చిరు వ్యాపారులు కూడా లబ్దిపొందుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,910 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,320 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story