Sun Dec 22 2024 15:22:35 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదుగా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరసగా పదో రోజు కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరసగా పదో రోజు కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది. గురువారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో స్వామి వారి దర్శనానికి సమయం చాలా సేపు పడుతుంది. వసతి గృహాల వద్ద భక్తులు క్యూ కనపడుతుంది. ఎక్కడ చూసినా భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల వీధులు మారుమోగిపోతున్నాయి. లడ్డూల కౌంటర్ వద్ద కూడా పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత లడ్డూలను తీసుకోవాలంటే భక్తులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎన్ని కౌంటర్లు ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆలస్యంగా మారింది. ఇక రేపటి నుంచి వరసగా మూడు రోజుల పాటు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
19 కంపార్ట్మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పంధొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుండగా, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,772 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,293 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story