Wed Apr 09 2025 20:48:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం.. నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వేసవి సెలవులు ఇవ్వకముందే దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే. తలనీలాల నుంచి తీర్ధప్రసాదాల వరకూ అంతటా పెద్ద పెద్ద క్యూలు. ఇక అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల మూడో వారం నుంచి...
ఈ నెల మూడో వారం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే పరీక్షలు ముగియడంతో ఫలితాలు వచ్చేస్తాయి. దీంతో పాటు వేసవి సెలవులు కూడా వస్తుండటంతో ఇక తిరుమల నిత్యం కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష జరిపి వేసవిలో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించారు. దీంతో తాగునీరు, అన్నప్రసాదాలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకున్న వారికి శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,327 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,354 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story