Wed Mar 26 2025 14:29:08 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. అయితే గురువారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన ద్వారం నుంచి మాడ వీధుల వరకూ కార్పెట్లను వేశారు. నిత్యం నీళ్లతో తడుపుతూ భక్తుల కాళ్లకు ఎండ వేడిమి తగలకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
భక్తులతో నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. గోవింద నామ స్మరణలతో మాడవీధులు మార్మోగిపోతున్నాయి. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కంపార్ట్ మెంట్లలో కూడా భక్తుల సందడి కనిపిస్తుంది. ఇటు లడ్డూ కౌంటర్ల వద్ద, అన్నప్రసాదం సత్రం వద్ద కూడా రష్ అధికంగానే ఉంది. ఇక శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,285 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,829 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.11 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story