Wed Mar 26 2025 11:48:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. గురువారమయినా భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. గురువారమయినా భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. సాధారణంగా గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. కారణాలు ఏవైనా రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలకు ముందు ఏడుకొండల వాడికి మొక్కుకునేందుకు తిరుమలకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తుంటారని అందులో భాగంగానే ఈరోజు కూడా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
గోవింద నామస్మరణతో...
భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్ మెంట్లన్నీ ఫుల్లు అయిపోయాయి. మాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా కంపార్ట్ మెంట్లలో కూలర్లను ఏర్పాటు చేశారు. ఉక్కపోతకు గురి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగుతుందని తెలిపారు.
23 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం ఈ ఉదయం క్యూలైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శన సమయం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,270 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,175 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటలు శ్రీవారి దర్శనం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story