Mon Apr 21 2025 23:35:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ... రీజన్ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. సహజంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. కంపార్ట్ మెంట్లలోనూ భక్తులు నిండిపోయి కనిపించడంతో దర్శనానికి ఆలస్యమవుతుంది.
దేశ వ్యాప్తంగా...
వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత కొంత భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపించినప్పటికీ తిరుమలలో ఎప్పుడూ భక్తుల సంఖ్యకు కొదవ ఉండదు. ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి వస్తారు. విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తిరుమలలో ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుందని అధికారులు ఆ మేరకు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో...
ఇక మరో రెండు రోజుల పాటు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా ఎస్.ఎస్.డి. టోకెన్లు ఏరోజుకారోజు ఇస్తుండటం కూడా భక్తుల రద్దీ పెరగడానికి కారణమని చెప్పాలి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనంలోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో కి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 56,225 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,588 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story