Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. శనివారం భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆదివారం కూడా భక్తులు అంతగా రారని టీటీడీ అధికారులు భావించారు. అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. ఆదివారం కావడంతో పాటు చుట్టు పక్కల జిల్లాలకు చెందిన వారు అత్యధికంగా వచ్చారని భావిస్తున్నారు. అదే సమయంలో పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం సౌకర్యం ఉన్నప్పటికీ వారికి కూడా ఆలస్యమవుతుంది. ఇక మాడ వీధులన్నీ భక్తుల గోవింద నామస్మరణతో మారు మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద కూడా రష్ అధికంగా ఉండటంతో అధికారులు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. తిరుమలకు రద్దీ పెరగడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.