Wed Mar 26 2025 12:04:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు ఎన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులున్నారంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. మరీ అంత తక్కువగా లేదు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కొంత సమయాన్ని వేచిచూడక తప్పని పరిస్థితి. నిన్న శివరాత్రి సెలవు దినం కావడంతో కొంత మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ఏడుకొండల వాడి వద్ద తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సాధారణంగా ఉన్నప్పటికీ ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
రద్దీ తక్కువగా...
ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. ఇక రోజు వారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో ఎక్కువ మంది వాటిని తీసుకుని దర్శనానికి వస్తున్నారు. వసతి గృహాలకు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండానే భక్తులు పొందుతున్నారు. పెద్దగా వెయిట్ చేయకుండానే గదులు చిక్కుతున్నాయి. లడ్డూ కౌంటర్ల వద్ద కూడా పెద్దగా రష్ లేదు. అలాగే తరిగొండ వెంగమాంబ సత్రం వద్ద కూడా భక్తుల తాకిడి అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఏడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,323 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 20,460 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story