Thu Dec 26 2024 21:51:30 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత రెండు రోజుల నుంచి తిరుమల కొండపై భక్తుల సంఖ్య పెద్దగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత రెండు రోజుల నుంచి తిరుమల కొండపై భక్తుల సంఖ్య పెద్దగా లేదు. స్వామి వారి దర్శనం సులువుగా భక్తులు పూర్తి చేసుకున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. బుధ, గురువారాలు పెద్దగా రష్ లేకపోడంతో దర్శనం సులువుగా అయిందని భక్తులు చెబుతున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వసతి గృహాల కోసం కూడా ఎక్కువ మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఇక అన్న ప్రసాదం క్యాంటిన్ల వద్ద కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో తరిగొండ వెంగమాంబ సత్రం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడిపోతుంది.
ఇటీవల కాలంలో...
తిరుమలకు ఇటీవల కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. హుండీ ఆదాయం కూడా శ్రీవారికి భారీగానే పెరిగింది. ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం లభిస్తుంది. దీంతో పాటు శ్రావణ మాసం కావడంతో ఈ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధీకారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట టీబీసీ వరకూ భక్తులతో కూడిన క్యూ లైన్ నిండిపోయి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ భక్తులకు ఆరు గంటల సమయం దర్శనానికి పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 63,202 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,057 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story