Fri Nov 22 2024 10:15:21 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కుట్ర : విచారణ జరగాలి
వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ ఎవరెవరితో మాట్లాడుతుందో, ఎవరితో సమన్వయంగా ఉంటూ కుట్ర పన్నుతోందో..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో కొత్తగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం తీవ్ర సంచలనమైంది. వివేకా హత్యకేసులో ఇప్పుడు సీఎం జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సెన్సేషన్ కోసమే.. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం జగన్ పేరును ప్రస్తావించారన్నారు. సీబీఐ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. హత్యకేసు అఫిడవిట్ లో ఆకస్మికంగా ఒక సీఎం పేరు ప్రస్తావించడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ ఏం చేసినా, ఏం చెప్పినా చెల్లుతుందన్న ధీమాతో జగన్ పేరును తీసుకొచ్చారన్నారు.
వివేకా హత్యకేసులో అకస్మాత్తుగా జగన్ పేరు ప్రస్తావించడం వెనుక సీబీఐ కుట్ర ఉందని, ఈ విషయంపై లోతైన విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా జగన్ పేరును ప్రస్తావించడం కేవలం సెన్సేషన్ కోసమేనని సజ్జల తెలిపారు. వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ ఎవరెవరితో మాట్లాడుతుందో, ఎవరితో సమన్వయంగా ఉంటూ కుట్ర పన్నుతోందో విచారణ చేయాలన్నారు. వివేకా హత్యకేసుతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడమే సీబీఐ టార్గెట్ గా పెట్టుకుందని, విచారణ పేరుతో ఆ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందన్నారు. కొన్ని మీడియా సంస్థలు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా సీబీఐ జగన్ పేరును అఫిడవిట్ లో చేర్చిందని సజ్జల పేర్కొన్నారు. అలాగే వివేకా కుమార్తె సునీత.. కొన్ని మీడియా సంస్థలకు, చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతుందో బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసు విచారణను సీబీఐ పలు మీడియా సంస్థలకు లీక్ చేస్తోందని ఆయన ఆరోపించారు.
Next Story