Thu Dec 26 2024 08:17:07 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : సజ్జల హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారా? అందుకు రీజన్ ఇదేనా?
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారట
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు బెజవాడను వదిలి హైదరాబాద్ కు చేరుకున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యవహరిస్తూ జగన్ తర్వాత రెండో స్థానంలో నిలిచారంటారు. జిల్లాల్లో ఏ బదిలీ జరగాలన్నా, నియోజకవర్గాల్లో కీలక నిర్ణయం అమలు కావాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి అవసరం. నాటి ముఖ్యమంత్రి జగన్ సజ్జలకు ఫుల్లు పవర్ ఇవ్వడంతో ఆయన ఇక ఐదేళ్ల పాటు వెనుదిరిగి చూడలేదు. ఇటు పార్టీ వ్యవహారాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చక్కబెట్టేవారు.
ఓటమి తర్వాత...
కానీ వైసీపీ ఓటమి పాలయిన తర్వాత నాయకులు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపు వేలెత్తి చూపారు. ఓటమి తర్వాత జగన్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న వివిధ సమావేశాలకు, నేతలతో భేటీకి కూడా సజ్జల దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో పాటు నేతల మధ్య సమన్వయం కుదరాలంటే నేరుగా తానే కలసి వారితో చర్చించడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టారంటున్నారు.
కూటమి ప్రభుత్వం...
అందుకే ఆయన బెజవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఐదేళ్ల పాటు హోం శాఖను తన చేతిలో ఉంచుకుని టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలు అప్పుడే టీడీపీ నేతలు చేశారు. దీంతో సజ్జల కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా టార్గెట్ అవుతారని భావించి సజ్జల రామకృష్ణారెడ్డిని కొంత కాలం పార్టీకి దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆయన ఎక్కువ సమయం విజయవాడలో కాకుండా హైదరాబాద్ లోనే గడుపుతున్నారని తెలిసింది. తన కుటుంబాన్ని కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తాడేపల్లికి వచ్చినప్పుడు మాత్రం ఆయన వచ్చి వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
త్వరలో కేసులు...
సజ్జల రామకృష్ణారెడ్డిపై త్వరలో కేసులు నమోదయ్యే అవకాశముందని భావించి ఆయన కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. నాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేసినప్పటికీ, జగన్ ఇచ్చిన సూచనలను అమలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వంతో పాటు సొంత పార్టీలోనూ ఆయనపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇటు కార్యకర్తల్లోనూ కొంత ఆయనపై అసహనం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో పాటు జగన్ కూడా ఎక్కువగా బెంగళూరులో ఉంటుండటం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో తనకు పనిలేదని భావించిన సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కు పయనమయ్యారని అంటున్నారు.
Next Story