Sat Dec 21 2024 17:13:12 GMT+0000 (Coordinated Universal Time)
Dharmavaram : "ధర్మవరం" దద్దరిల్లుతుందిగా.. మంత్రికి సొంత కూటమి నుంచే రచ్చ మొదలయిందా?
తొలిసారి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి పదవి చేపట్టిన సత్యకుమార్ యాదవ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు
తొలిసారి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి పదవి చేపట్టిన సత్యకుమార్ యాదవ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. కూటమిలోని పార్టీలను కలుపుకు పోవడంలో విఫలమయ్యారు. మంత్రి సత్యకుమార్ పై టీడీపీ నేతలు గుర్రుమంటున్నారు. టీడీపీ అధినియకత్వం సత్యకుమార్ చర్యలను అడ్డుకోకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని వెళ్లేవరకూ వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ సత్యకుమార్ మాత్రం టీడీపీ నేతలను, కార్యకర్తలను బేఖాతరు చేస్తూ తన దారిన తాను వెళ్లిపోతున్నారు. ఇది ఒక రకంగా కూటమి పార్టీల్లో చిచ్చు రేపే విధంగానే ఉంది.
పొత్తులో భాగంగా...
అసలు విషయానికి వస్తే ధర్మవరంలో ఎన్నికల ముందు వరకూ ఉన్న ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ను కాదని కూటమి ఏర్పడిన తర్వాత ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. అప్పటి వరకూ తానే విజేత అని భావిస్తున్న నాటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సత్యకుమార్ ను ఎంపిక చేయడంతో గెలుపు తనదేనని భావించారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమిష్టిగా పనిచేసి ధర్మవరంలో కేతిరెడ్డిని స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడించగలిగారు. మిగిలిన నియోజకవర్గాల్లో యాభై వేలకు పైన వచ్చి మెజారిటీలు ధర్మవరానికి వచ్చేసరికి మాత్రం రెండు వేలకు మించలేదు. అయినా అందరూ కలసి పనిచేయడంతోనే సత్యకుమార్ విజయం సాధించారు.
అనుకోకుండా మంత్రి అయి...
అయితే అదృష్టం సత్యకుమార్ ఇంట్లోనే ఉంది. కేవలం ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా బీజేపీలో నమ్మకమైన నేతగా ఉన్న ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. హేమాహేమీలను పక్కన పెట్టారు. సత్యకుమార్ కు అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. కానీ సత్యకుమార్ మాత్రం వైసీపీ స్థానిక నేతలను దగ్గరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన కంటే వైసీపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అక్కడ విమర్శలు బాహాటంగా చేస్తున్నారు. మరోవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధానమైన వారిని దూరం చేయడానికే సత్యకుమార్ వైసీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మున్సిపల్ కమిషనర్ ను...
ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనకూలంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ధర్మవరానికి సత్యకుమార్ తీసుకురావడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయి. తమను వేధించిన కమిషనర్ ను సత్యకుమార్ కావాలనే మున్సిపల్ కమిషనర్ గా తీసుకు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు పరిటాల శ్రీరామ్ కూడా సత్య కుమార్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆయన బహిరంగంగా బయట పడకపోయినా, ఆయన వర్గీయులు మాత్రం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం ఇప్పుడు ధర్మవరంలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. దీనిపై సత్యకుమార్ తో చర్చించి సమస్యను పరిష్కరించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story