Thu Nov 21 2024 14:03:11 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas Cylender : "దీపం" పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఈ నెల 31వ తేదీ నుంచి అమలు కానుంది
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఈ నెల 31వ తేదీ నుంచి అమలు కానుంది. అంటే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందనున్నాయి. అయితే ఇందుకోసం అర్హతలను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం దరఖాస్తులను కూడా చేసుకోవాలని సూచించింది. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం దాదాపు 2,700 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నప్పటికీ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ కనుక దానిని దీపావళి గిఫ్ట్ గా మహిళలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం పడనుంది.
లబ్దిదారులకు హెచ్చరికలు...
ఇక ఇప్పటికే అర్హత ఏంటన్నది నిర్ణయించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు వర్తించనున్నాయి. ఒక కుటుంబానికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. అంతే కాదు ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇక్కడకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లే వారికి ఈ పథకం వర్తించదు. ఇక్కడే స్థిర నివాసం ఉండాలి. నెలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి పదివేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో ఉండే వారికి పదిహేను వేల రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదు. దీంతో పాటు ఖచ్చితంగా ఆధార్ కార్డుతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉండాలి. అవి లేకున్నా ఈ పథకం వర్తించదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ పనులకు వినియోగించినా, చిరు వ్యాపారులకు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ను గృహ వినియోగం కోసమే వినియోగించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ఆన్లైన్ లో...
ఇక దీనికి సంబంధించి విధిగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచే దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఉన్న వివరాలను పూరించి దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా వార్డు, గ్రామ, పట్టణ సచివాలయాల్లో నేరుగా ఇచ్చే అవకాశముంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ లో కూడా పూర్తి చేసి పంపే వీలుంటుంది. అన్ని అర్హతలను పరిశీలించిన తర్వాత ఈ పథకం కింద ఎవరు లబ్దిదారులన్నది నిర్ణయిస్తారు. ఒక్కొక్క సిలిండర్ ప్రస్తుతం ఎనిమిది వందల రూపాయల వరకూ గ్యాస్ కంపెనీలు వసూలు చేస్తున్నాయి. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను వెంట వెంటనే పొందడానికి వీలు లేదు. కనీసం నెలన్నర, రెండు నెలల సమయం ఉండాలి. ఆ తర్వాతనే రెండో సిలిండర్ అందచేయనున్నారు. ఈ నిబంధన అందరూ లబ్దిదారులకు వర్తిస్తుంది.
Next Story