Tue Nov 05 2024 14:52:45 GMT+0000 (Coordinated Universal Time)
Gorantla : గోరంట్లకు అవకాశం దక్కనిది అందుకేనా? అదే లేకుంటే ఛాన్స్ వచ్చేదా?
టీడీపీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి మంత్రివర్గంలోనూ స్థానం దక్కలేదు
ఆయన సీనియర్ తెలుగు దేశం పార్టీ నేత. రాజకీయ విపక్షాలకు సయితం చుక్కలు చూపించనున్న సమర్ధుడు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు ఈయన అదృష్టం తిరగబడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయాల్లోను, ముఖ్యంగా టీడీపీ రాజకీయాల్లోనూ సీనియర్ మోస్ట్ అయిన బుచ్చయ్య చౌదరి.. గతంలో ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన నాలుగు సార్లు రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రి వర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగానూ పనిచేశారు.
ఎన్నో ఆశలు పెట్టుకుని...
అయితే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఈసారి కేబినెట్ లో తనకు ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని భావించారు. ఆశించారు. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు. అంటే ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. అంటే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కల నెరవేరదా? అన్న అనుమానం ఆయన అనుచరుల్లో బయలుదేరింది. సన్నిహితులు కూడా గోరంట్లకు అవకాశమిచ్చి ఉంటే పెద్దాయన ఆనందపడే వారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే గోరంట్లకు ఈ దఫా పదవి దక్కడంతో ఆయన నిరాశలో కూరుకుపోయారు.
స్థాన, కుల బలం లేని చోట...
గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలుపు అసాధారణమైనది. ఎందుకంటే.. కులం, స్థాన బలం లేని చోట ఆయన గెలిచారు. తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గం తక్కువే. అక్కడ కాపులు, శెట్టి బలిజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. అయినా ఆయన అక్కడ ఏడుసార్ల నుంచి నెగ్గుతూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య ఎప్పుడో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన గెలిచినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం పదవి దక్కలేదు. ఇందుకు ప్రధానమైన కారణం ఆయన సామాజికవర్గమేనని చెప్పకతప్పదు. తూర్పు గోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం కష్టంగా మారుతుంది.
ఈసారి కూడా...
తన సీనియారిటీ, సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆశపడ్డారు. ఆశించారు కూడా. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో తన సీనియార్టీని చంద్రబాబు గౌరవిస్తారని, తనకు మంత్రి పదవి ఇస్తార ని బుచ్చయ్య ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుచరులు ఏకంగా పండగ చేసుకున్నారు. అయితే, అప్పటి పరిస్థితిలో బుచ్చయ్యకు అవకాశం దక్కలేదు. ఇక, 2017 ఏప్రిల్లో మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఈ సందర్భంలోనైనా తనకు ఛాన్స్ దక్కుతుందని బుచ్చయ్య అనుకున్నారు. కానీ లభించలేదు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. దీంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరి గోరంట్ల ఎలా రెస్పాండ్ అవుతారన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
Next Story