Mon Dec 23 2024 12:15:57 GMT+0000 (Coordinated Universal Time)
Botsa : సత్తిబాబుకు ఎన్ని కష్టాలు... గెలిచి పార్టీకి ఊపిరి పోస్తారా?
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా బరిలోకి దిగుతున్నారు
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా బరిలోకి దిగుతున్నారు. ఆయన పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. సీనియర్ నేతగా బొత్స సత్తిబాబు అయితేనే కరెక్ట్ అని ఆయన పేరు కన్ఫర్మ్ చేశారు. ఈ ఎన్నిక బొత్స సత్యనారాయణ సవాల్ వంటిది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బలం నిలుపుకోవాలన్నా, తన పట్టును మరింత పెంచుకోవాలన్నా ఈ ఎన్నికల్లో బొత్సకు గెలవడం అనివార్యంగా మారింది. మరోవైపు అధికార పార్టీకి తన గెలుపు ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉంది. ఆరు వందలకు పైగా ఓట్లున్నాయి. టీడీపీ కూటమికి 250కి మించి లేవు. దీంతో ఆయన గెలుపు గణాంకాల పరంగా చూస్తే నల్లేరు మీద నడకేనని చెప్పుకోవాలి.
టీడీపీకి టార్గెట్ గా...
ఇప్పుడు అధికార పార్టీకి లక్ష్యంగా మారారు. ఉత్తరాంధ్రలో కింగ్ గా చెప్పుకునే సత్తిబాబుకు ఈసారి ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. రెండో దఫా చేపట్టిన ఆయన శాఖ వల్ల విమర్శలు కూడా వచ్చాయి. టీచర్ల బదిలీల విషయంలో ప్రస్తుత అధికార పార్టీ ఆయనపై కేసు నమోదు చేసే అవకాశముందని తెలిసింది. ఇటు పార్టీలో ఉత్తరాంధ్ర లో ఉన్న కింగ్ పోస్టు పోయి.. ఇటు కేసులు నమోదయితే ఏటి సేత్తాం అన్న తరహాలో ఆయన ఉన్నారు. బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయినా ఓటమిపాలయ్యారు. 2019 నాటికి ఆయన వైసీపీలో చేరారు. తిరిగి గెలిచి ఉత్తరాంధ్రకు వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు.
అత్యధిక ప్రయారిటీ...
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడతో బొత్స సత్తిబాబుకు మంత్రి పదవి లభించింది. పూర్తి కాలం మంత్రిగా ఉన్న అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. తన కనుసైగలతో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించేవారు. జగన్ కు కూడా బొత్స సత్యనారాయణపై అంత నమ్మకం ఉండేది. అందుకే ఈసారి ఎన్నికల్లో జగన్ ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యత ఆయనకు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన కుటుంబానికి నాలుగు టిక్కెట్లు ఇచ్చారంటే సత్తిబాబు సత్తాపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకు పేరుంది. జగన్ ఐదేళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ అండగా నిలిచినందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్్ ఇచ్చారంటారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కుటుంబంలో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు. చివరకు చీపురుపల్లిలో తిరుగులేదనుకున్న బొత్స సత్యనారాయణ కూడా ఓటమి చెందడంతో ఆయన ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
నాలుగు టిక్కెట్లు...
1999 నుంచి ఆయన రాజకీయాల్లో అదీ ఉత్తరాంధ్రలో గ్రిప్ ఉన్న నేతగా పేరు పొందారు. 2009, 2014, 2024 ఎన్నికల్లోనూ ఆయన కుటుంబం నుంచి నాలుగు టిక్కెట్లు దక్కించుకున్నారంటే ఆయనకు పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో చీపురుపుల్లి నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖ పార్లమెంటు అభ్యర్ధిగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, గజపతినగరం నుంచి ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయయం, నెలమర్ల నుంచి బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నలుగురిలో బొత్స ఓటమి ఊహించలేనిది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ఆ నియోజకవర్గంలో చేసినా ఎందుకు తనను ఓడించారన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదని సత్తిబాబు తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.
తనపై నమ్మకం ఉంచి...
కానీ ఈ ఎన్నికల్లో జగన్ తనపై మరోసారి నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకున్నట్లవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా బొత్సను ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతుంది. అందుకే సత్తిబాబుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఓటర్లను కాపాడుకోవడం కత్తిమీద సామే అవుతుంది. ఇప్పటికే పన్నెండు మంది విశాఖ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన ఓట్లు చేజారిపోకుండా క్యాంప్ లను కండక్ట్ చేయాలి. ఆ ఆర్థిక బలం అయితే సత్తి బాబుకు ఉంది. సత్తి బాబు ఈ ఎన్నికల్లో గెలిస్తే మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశముంది. మరి చివరకు సత్తిబాబు తనకు దక్కిన ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story