Wed Apr 02 2025 19:04:05 GMT+0000 (Coordinated Universal Time)
Ram Gopal Varma : ఆర్జీవీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారా? పోలీసులకు అంతుపట్టడం లేదా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు ఆరు గంటలుగా ఒంగోలు పోలీసులు విచారిస్తున్నారు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు ఆరు గంటలుగా ఒంగోలు పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసుల ప్రశ్నలకు మాత్రం వర్మ నేరుగా సమాధానం చెప్పకుండా క్యాజువల్ గా తన స్టయిల్ లోనే సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. వ్యూహం ప్రమోషన్ లలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టింగ్ లపైన కూడా వర్మను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఆ ప్రశ్నకు కూడా ఆర్జీవీ నుంచి సూటిగా సమాధానం రాలేదని తెలిసింది. ఆర్జీవీని ప్రశ్నించడానికి దాదాపు యాభై ప్రశ్నలను సిద్ధం చేసుకున్న పోలీసులకు వర్మ నుంచి సరైన సమాధానాలు మాత్రం రావడం లేదని చెబుతున్నారు.
వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై...
వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ప్రశ్నించగా తనకు అన్ని పార్టీల నేతలు మాట్లాడుతుంటారని, వ్యక్తిగత పరిచయాలే తప్ప పార్టీలతో తనకు సంబంధం లేదని, తాను ఒక చిత్ర దర్శకుడనని ఆయన చెప్పినట్లు తెలిసింది. తాను ఎవరికీ శత్రువును కానని, అలాగే మిత్రుడిని కానని కూడా వర్మ అనడంతో పోలీసులు అవాక్కయినట్లు చెబుతున్నారు. అయితే ఒంగోలు వస్తున్న సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలిశారని పోలీసులు వేసిన ప్రశ్నకు తనకు చెవిరెడ్డి స్నేహితుడని, వ్యక్తిగత సంబంధాల కారణంగానే కలిశానని వర్మ తెలిపినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టింగ్ లపై కూడా తికమకగా వర్మ సమాధానం విన్న పోలీసులు ఒకదశలో అసహనానికి గురయినట్లు చెబుతున్నారు.
నేరుగా సమాధానం చెప్పకుండా...
రామ్ గోపాల్ వర్మ మామూలుగానే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. సోషల్ మీడియాలో అనేక మంది వచ్చి తనను ఇంటర్వ్యూలు చేస్తారని, వారికి సమాధానం ఇచ్చే సమయంలో తన మనసులో ఉన్నదే చెబుతానని, అంతకు మించి ఏమీ లేదని కూడా మరొక ప్రశ్నకు సమాధానంగా ఆర్జీవీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వైసీపీ హయాంలో రెండు కోట్ల రూపాయల నిధులు వచ్చినట్లు అడిగిన ప్రశ్నకు మాత్రం వర్మ దాట వేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏదీ నేరుగా వర్మ సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు ప్రశ్నలను మార్చి మార్చి వేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందంటున్నారు. మరో రెండు నుంచి మూడు గంటలు వర్మను ప్రశ్నించే అవకాశముంది. వర్మ వెంట ఆయన న్యాయవాదులు కూడా ఉండటంతో వారు కూడా కొన్ని సంబంధం లేని ప్రశ్నలకు అడ్డుతగులుతున్నట్లు బయటకు వార్తలు వచ్చాయి.
Next Story