Tue Nov 05 2024 15:34:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకండి
రుతుపవనాల రాక ఆలస్యం, అరేబియా సముద్రంలో తుపాను కారణంగా జూన్ రెండోవారం వచ్చినా ఉష్ణోగ్రతలు తగ్గలేదు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా ఎండలు గూబగుయ్ మనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే బయటికెళ్లాలంటేనే జంకుతున్నారు. రోహిణి కార్తె వచ్చి వెళ్లిపోయి.. మృగశిర కార్తె ప్రారంభమైనా 40 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. రుతుపవనాల రాక ఆలస్యం, అరేబియా సముద్రంలో తుపాను కారణంగా జూన్ రెండోవారం వచ్చినా ఉష్ణోగ్రతలు తగ్గలేదు. మరో వారంరోజులు ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి ఉంటుందని తాజాగా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 14 జిల్లాల్లోని ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు 43 నుంచి 47 వరకూ నమోదు కావొచ్చని హెచ్చరించింది.
ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, యానాం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జూన్ 11 నుండి 17వ తేదీ వరకూ అధిక ఉష్ణోగ్రతలతో పాటు.. తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే కర్నూల్, నంద్యాల, కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 నుండి 43 డిగ్రీల వరకూ నమోదు కావొచ్చని తెలిపింది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు 35 నుండి 39 డిగ్రీల వరకూ ఉంటాయని వివరించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాల ప్రజలు వీలైనంతవరకూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావొద్దని హెచ్చరించింది.
Next Story