ఆంధ్రప్రదేశ్: ప్లేటులో రొయ్యల కర్రీ.. కానీ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు!
అమెరికా దిగుమతులపై సుంకం పెంపుతో వనామీ రొయ్యల ధర కుప్పకూలింది. ఏపీ రైతులకు తీవ్ర నష్టం, ప్రభుత్వంపై విమర్శలు.

ఆంధ్రప్రదేశ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా దిగుమతులపై సుంకాలను 3% నుండి 26% వరకు పెంచడంతో, ఏపీ నుంచి ఎగుమతి అయ్యే వనామీ రొయ్యల ధర ఒక్కసారిగా పడిపోయింది. దీని ప్రభావంతో రూ. లక్ష విలువైన రొయ్యలు ఇప్పుడు లక్షా 26 వేలు ఖర్చవుతుండగా, రవాణా, ప్యాకింగ్ తో కలిపి మొత్తం ఖర్చు 50% పెరిగిపోయింది.
ఇక ఎగుమతి దారులు ధరలు కేజీకి రూ. 30 నుంచి 50 వరకు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 250 ఉండగా, ఇప్పుడు అది రూ. 210కి పడిపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి అమెరికా సుంకం అమల్లోకి రానుంది. ఏటా ఏపీ నుంచి 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుండగా, ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రోజుకు 2 వేల టన్నులు వెళ్తున్నాయి.
రైతుల ఆందోళనల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. రొయ్యలపై సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మత్స్యరంగం ఏపీ జీడీపీలో 11% వాటాతో కీలకంగా ఉందని, ఈ సంక్షోభ సమయంలో రైతులకు అండగా ఉండాలని ఆయన లేఖలో వివరించారు. అధిక సుంకాల వల్ల విదేశీ ఆర్డర్లు రద్దవుతుండటంతో పాటు, గిడ్డంగుల్లో నిల్వ స్థలాలు కూడా లేవని ఆయన వెల్లడించారు.
ఇక కేంద్రం ఆక్వా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భరోసా ఇచ్చారు. అయితే, రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యాపారవర్గాలే ధరలు కుదించే సిండికేట్‌గా మారారని ఆరోపిస్తూ, రైతులకు అండగా పోరాడతామని స్పష్టం చేశారు.