Fri Nov 15 2024 01:53:40 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్: తీర్పు రిజర్వ్
ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే సెక్షన్ 17ఏ
స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే సెక్షన్ 17ఏ చట్టం తీసుకొచ్చారని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని రోహత్గీ తెలిపారు. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని తెలిపారు. వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేమన్నారు ముకుల్ రోహత్గీ. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు ముకుల్ రోహత్గీ. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందన్నారు హరీష్ సాల్వే. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని.. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సాల్వే తెలిపారు.
Next Story