Mon Dec 23 2024 06:46:55 GMT+0000 (Coordinated Universal Time)
అమానవీయం.. చనిపోయిన కొడుకుని బైక్ పై ఇంటికి తీసుకెళ్లిన తండ్రి
దిగువ పుత్తూరులో ఉండే చెంచయ్య అనే వ్యక్తికి బయవయ్య(7) అనే కుమారుడు ఉన్నాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో..
తిరుపతి జిల్లాలో మరో అమానవీయ, హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాముకాటుతో మరణించిన కొడుకు మృతదేహాన్ని ఓ తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి బైక్ పై తీసుకెళ్లడం కలచివేస్తోంది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు. ఈ ఘటన కేవీబీపురం మండలం దిగువపుత్తూరులో చోటు చేసుకుంది. గతంలో రుయా ఆస్పత్రి వద్ద ఇదే తరహా ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దిగువ పుత్తూరులో ఉండే చెంచయ్య అనే వ్యక్తికి బయవయ్య(7) అనే కుమారుడు ఉన్నాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో అతను రెండవ తరగతి చదువుతున్నాడు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా నాగుపాము బాలుడిని కాటు వేయడంతో.. నురగలు కక్కుతూ కిందపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి, తండ్రికి సమాచారమిచ్చారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లబోయాడు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక్క ప్రైవేటు వాహనం కూడా ముందుకురాలేదు. దీంతో గుండె రాయి చేసుకుని తెలిసినవారి దగ్గర బైక్ తీసుకుని.. దానిపై కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
Next Story