ఆన్ లైన్ గేమ్స్ వద్దని వారించిన తల్లిని కత్తితో నరికి చంపిన కొడుకు ..!
ఆన్ లైన్ గేమ్స్ మీద మత్తు పడిన కొడుకు తల్లి ని కత్తితో హత్య. విశాఖపట్నం లో విచిత్ర సంఘటన!

ఆన్ లైన్ గేమ్స్ మత్తులో పడి ఎప్పుడు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అసలు ఊహించలేము. ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన ఓ యువకుడు ఆట ఆడకుండా ల్యాప్‌టాప్, ఫోన్ దాచిపెట్టిందని కన్నతల్లిని హతమార్చాడు. విచక్షణా రహితంగా దాడి చేసి, పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఈస్ట్రన్ సీ బోర్డు పరిధి తీరగస్తీ దళంలో విధులు నిర్వర్తిస్తున్న బల్బీర్‌సింగ్ కుటుంబంతో సహా రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖ కోస్టుగార్డు క్వార్టర్స్‌లో ఉంటున్నారు. జనవరి 30న బల్బీర్‌సింగ్ విధులకు వెళ్లగా భార్య అల్కాసింగ్(47), కుమారులు అన్‌మోల్‌సింగ్, ఆయుష్మాన్సింగ్ ఇంటివద్దే ఉన్నారు. అన్‌మోల్‌సింగ్ బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు.
అన్‌మోల్‌సింగ్ ఇంట్లో ల్యాప్‌టాప్‌లో గేమ్ ఆడుతుండగా తల్లి అల్కాసింగ్ వద్దని చెప్పింది. చదువుకోకుండా ఆటలేంటని ల్యాప్‌టాప్, ఫోన్ దాచిపెట్టింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన అన్‌మోల్‌సింగ్ ఇంట్లోని కత్తి తీసుకుని వచ్చి తల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమెను పడక గదిలో పెట్టి తాళం వేశాడు. బయట ఉన్న చిన్న కుమారుడు ఆయుష్మాన్సింగ్ ఇంటికి వచ్చేసరికి గదికి తాళం వేసి ఉండటం, అన్‌మోల్‌సింగ్ కంగారుపడటాన్ని గమనించి ప్రశ్నించాడు. ఆ తర్వాత అల్కాసింగ్ మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.