Sun Dec 22 2024 21:39:13 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : పోలీసులు కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. చూస్తూ ఉండటం వల్లనే హింసాత్మక ఘటనలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీకి నివేదిక అందించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీకి నివేదిక అందించింది. 150పేజీలతో కూడిన నివేదికను సిట్ అందచేసింది. అయితే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తెలిపింది. ఇందులో పల్నాడు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఏడు కేసులు, తిరుపతి జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు కేసులు నమోదయినట్లు సిట్ తన నివేదికలో తెలిపింది. 33 కేసుల్లో 1,370 మందిని నిందితులుగా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ కేసులకు సంబంధించి 124 మందిని అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపింది. దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
కొత్త సెక్షన్లు చేరే అంశంపై...
నమోదయిన ఎఫ్ఐఆర్ లలో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైన కూడా సిట్ సిఫార్సు చేసినట్లు తెలిపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా సిట్ తన నివేదికలో అభిప్రాయపడింది. కొన్ని చోట్ల పోలీసులు మౌనంగా ఉండటం వల్ల ఘటనల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. అయితే సిట్ అందించిన ఈ నివేదిక ప్రాధమిక సమాచారం సేకరించిన తర్వాత రూపొందించింది మాత్రమే. పూర్తి స్థాయి నివేదికను సమర్పించడానికి ఎన్నికల కమిషన్ ను గడువు కోరింది. ప్రస్తుతం సిట్ సమర్పించిన నివేదికను డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపనుంది.
Next Story