High Alert: తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులు
భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని, క్రమంగా ఉత్తర దిశగా ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. డిసెంబరు 6న ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమలో డిసెంబరు 4న చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.