శ్రీకాకుళంలో పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులు.. సీన్ కట్ చేస్తే..
ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జిల్లాలోకి ఎటునుండి అయినా ఉగ్రవాదులు..
శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జిల్లాలోకి ఎటు నుండి అయినా ఉగ్రవాదులు ప్రవేశించి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందన్న సంచారంతో మంగళవారం నుండి 48 గంటలుగా మెరైన్, లా అండ్ ఆర్డర్ పోలిసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. జిల్లాలో 193 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి గస్తీ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపట్టారు. అయితే అనుకున్నట్టు గానే శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపాడు వద్ద 16వ నెoబర్ జాతీయ రహదారిపై పోలిసులు వాహనాల తనిఖీలు చేపట్టగా...ఆటోలో ప్రయాణిస్తూ నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలిసులు వారి బ్యాగ్ లను తనిఖీ చేయగా వారి వద్ద RDX తో పాటు అతి ప్రమాదకరమైన భారీ పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పట్టుబడ్డ ఆ నలుగురు వ్యక్తులు టెర్రరిస్టులని తేలింది. శ్రీకాకుళం పెదపాడు లోని డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను పెల్చేసెందుకు కుట్ర పన్ని వచ్చినట్లు తెలిసింది. వెంటనే పట్టుబడిన నలుగురు టెర్ర రిస్టులను శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అయితే టెర్రరిస్టులు పట్టుబడటం, వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవటం వింటుంటే భయాందోళన కలిగించేలా ఉంది. కానీ ఇదంతా వాస్తవం కాదు. సాగర్ కవచ్ లో భాగంగా కోస్ట్ గార్డ్, మెరైన్, లా అండ్ ఆర్డర్ పోలిసులు సంయుక్తంగా చేపట్టిన మాక్ డ్రిల్ ఇది. దేశంలోకి ఒకవేళ ఉగ్రవాదులు జల మార్గానగాని, భూమార్గాన గాని ప్రవేశిస్తే స్థానిక రక్షణ వ్యవస్థలు ఎలా స్పందించి వారిని పట్టుకుంటాయి. ఉగ్రవాదుల చర్యలను ఏవిధంగా తిప్పుకొడతాయో తెలుసుకునే ఉద్దేశముతో సాగర కవచ్ పేరిట చేపట్టిన కార్యక్రమం ఇది. మున్ముందు ఇలావి ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొవడంలో వారికి సులభంగా ఉంటుంది. టెర్రరిస్టులను పట్టుకోవడంలో, ఏవైనా పేలుడు పదార్థాలు పట్టుబడిన సమయంలో ఎలా డీల్ చేయాలన్నది ఈ కార్యక్రమం ద్వారా వారికి మరింత అవగాహన ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి 48 గంటలు పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. కోస్ట్ గార్డ్, మెరైన్, లా అండ్ ఆర్డర్ పోలిసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.