Mon Dec 23 2024 11:38:47 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాకుళం వైసీపీలో అసంతృప్తి
అభ్యర్థి మార్పు విషయమై తమకు కనీస సమాచారం లేకపోవడంతో సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. శ్రీకాకుళంలో 2019
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలు సమాయత్తమవుతూ ఉన్నాయి. అయితే పలు జిల్లాల్లో పార్టీలలో వర్గ విబేధాలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లే లోపు ఏదో ఒకటి తేల్చేసుకుందామని అనుకునే వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వైసీపీలోని కొంతమంది నాయకుల మధ్య సఖ్యత కుదరకపోవడం.. కార్యకర్తల్లో అసమ్మతి ఎక్కువవుతోంది. ఎమ్మెల్యేల తీరుపై పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు సరైన ప్రాధాన్యం దక్కడం కోసం పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు రోడ్డెక్కుతూ అసమ్మతి బయటపెడుతున్నారు.
ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణుల నుంచే నిరసన సెగ తగులుతోంది. వారి తీరును వ్యతిరేకిస్తూ.. కొంతమంది నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు శ్రీకాకుళంలో సమావేశమై ఎమ్మెల్యే తీరుపై అసమ్మతి వెళ్లగక్కారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆమదాలవలస నియోజకవర్గం నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ పొందూరు మండలానికి చెందిన పార్టీ శ్రేణులు అసమ్మతి వెల్లగక్కారు.ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఓ విద్యావేత్త వైసీపీలో చేరినా వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే ప్రథమంగా టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనును సీఎం జగన్ ప్రకటించారు. కలిసికట్టుగా పనిచేయాలని పేడాడ తిలక్, కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉన్నట్లుండి.. దువ్వాడ శ్రీను సతీమణి వాణిని టెక్కలి ఇన్చార్జిగా జగన్ ప్రకటించారు. అభ్యర్థి మార్పు విషయమై తమకు కనీస సమాచారం లేకపోవడంతో సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. శ్రీకాకుళంలో 2019 ఎన్నికల్లో సుమారు ఐదువేల ఓట్ల మెజార్టీతో ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. ఈసారి గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అలాగే పలాసలో సీదిరి అప్పలరాజు తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగానే ఓ వర్గం సిద్ధమవ్వడం వైసీపీ విజయాలకు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది.
Next Story