Mon Jan 13 2025 00:08:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సోమావతి అమావాస్య.. ఏం చేయాలంటే?
శ్రీశైలం, శ్రీకాళహస్తి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతుంది. సోమవాతి అమావాస్య కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
సోమవారం రోజున అమావాస్య వస్తే దానిని సోమావతిఅమావాస్యగా పిలుస్తారు. పంచాంగాల్లో అమా సోమవార వ్రతం అని చెబుతారు. సోమవారం శివభక్తులకు ముఖ్యమైనది. అమావాస్యతో కూడిన సోమవారం రుద్రాభిషేకాదులు విశేషంగా నిర్వహించడానికి తగినది అని భక్తులు నమ్ముతారు. సోమావతి అమావాస్యనాడు మౌనవ్రతం పాటిస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు ప్రవచించాయి. అలాగే రావిచెట్టును భక్తులు పూజించడం కూడా ప్రత్యేకంగా ఈరోజు కనిపిస్తుంది. దీనినే అశ్వత్థనారాయణ పూజ అంటారు. రావిచెట్టు మొదట్లో ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. చెట్టు చుట్టూ 108సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణల సమయంలో చెట్టు చుట్టూ దారం చుట్టడం కూడా కనిపిస్తుంది.
కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...
అలాగే రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉన్నచోట కోరికలు మనసులో చెప్పుకుంటూ చెట్టుకొమ్మలకు తోరాలు వంటివి కట్టడం కనిపిస్తుంటుంది. రావిచెట్టును నారాయణ స్వరూపంగా, వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆ రెండుచెట్లూ కలిసి ఉన్నచోట లక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహిస్తారు. సోమావతి అమావాస్యనాడు ఆ చెట్లకు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి కోరికలైనా తీరుతాయని నమ్ముతారు. తమ కుటుంబం ఆయు రారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని నమ్ముతారు. అందుకే ఈరోజు శని ప్రదిక్షణలు కూడా చేసి పలు దానాలను ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న విషయం. ఇదే సమయంలో ఈరోజు శివుడిని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి క్షేత్రాలు ఇప్పటికే భక్తులతో కిటకిటలాడిపోతుంది. సోమవాతి అమావాస్య కోసం ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలంలో నేడు స్పర్శ దర్శనాన్ని కూడా రద్దు చేసిన అధికారులు భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు అవకాశం కల్పించారు.
Next Story