Mon Dec 23 2024 08:26:12 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కలియుగ వైకుంఠంలో ప్రతిరోజూ పండగే
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో నేడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారికి ఉత్సవాల దేవుడిగా పేరు. 365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు జరిగేది ఒక్క కలియుగ వైకుంఠ స్వామికే. అందుకే తిరుమలకు భక్తులు ఏడాది పొడవునా వస్తూనే ఉంటారు. తిరుమలకు రావడానికి ముహూర్తాలు పెట్టుకోరు. ఏడుకొండలవాడు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళతామన్నది ప్రజల విశ్వాసం. తిరుమలకు వెళ్లరంటే అదొక రకమైన అనుభూతి. ఆధ్మాత్మిక భావాలు విరాజిల్లే స్వామి వారి చెంత రెండు రోజులు గడపాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కోరుకుంటారు.
గరుడ సేవకు....
అయితే నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిన్న జరిగిన అంకురార్పణతో ప్రారంభించిన అర్చక స్వాములు నేడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. అక్టోబరు 8న శ్రీవారి గరుడ సేవ నిర్వహిస్తారు. లక్షల్లో ప్రజలు హాజరవుతారు. ఇందుకు భారీగా ఏర్పాట్లుకూడా చేస్తున్నారు. గరుడ సేవను చూడాలని ప్రతి భక్తుడూ పరితపించి పోతారు. దేశం నలుమూలల నుంచి గరుడసేవకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే జన్మ ధన్యమయినట్లేనని భావిస్తారు. ఆరోజు తిరుమల కొండ పైకి ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించరు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 9న సర్ణ రథోత్సవం, 11న రథోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, 13వ తేదీ ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నిత్య ఉత్సవాలు..
కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడైన వెంకటేశుడు కొలువై ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే. నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వెంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజూ ఒక పండుగగా, ప్రతిపూటా పరమాన్నభరిత నివేదనలతో, ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా, ఆరాధింపబడుతున్నారు. ఇంతకంటే కలియుగ వైకుంఠం గురించి వేరే చెప్పాలా?
Next Story