Tue Nov 05 2024 23:30:38 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేష్ పర్యటనలో రాళ్ల దాడి.. ఏపీ వైసీపీ నాయకులు ఏమన్నారంటే !
నారా లోకేష్ పర్యటనపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గూండాగిరిని
దుగ్గిరాల : హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. రాళ్లు, కొబ్బరి బోండాలు విసురుకున్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి చెందిన రూపాశ్రీ బుధవారం దారుణహత్యకు గురైంది. పోస్టుమార్టం చేసేందుకు రూప మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తీసుకొచ్చారు. తెనాలిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తుమ్మపూడికి తరలిస్తుండగా లోకేశ్ వచ్చేవరకు వెళ్లనివ్వబోమంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మార్చురీ గేటు ముందు బైఠాయించారు.
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేష్ తెనాలికి బయల్దేరారు. లోకేష్ వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు, రూప మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఇదే సమయానికి నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు, వైసీపీ నేతల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. రాళ్లు, కొబ్బరిబోండాలు విసురుకున్న ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. నారా లోకేశ్ నిలుచున్న చోటుకు అతి సమీపంలో ఓ పెద్ద రాయి వచ్చి పడింది. రాళ్ల దాడిని నిలువరించేందుకు యత్నించిన పోలీసులకు మాత్రం గాయాలయ్యాయి.
రూపాశ్రీ మరణంపై అనేక అనుమానాలున్నాయని, నిందితులను తప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. 21 రోజుల్లో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని, లేదంటే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే దీక్షకు కూర్చుంటానని చెప్పారు. దిశ చట్టం కింద ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉన్నదన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మీరన్నట్లుగా తాను మూర్ఖుడినే అని, ఎవర్నీ వదిలిపెట్టను అని వైసీపీ నేతలను హెచ్చరించారు.
నారా లోకేష్ పర్యటనపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి జెండాలు తగిలించుకుని 80 కార్లతో దండయాత్ర తరహాలో వచ్చారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన ఎనిమిది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు, కొబ్బరిబోండాలు విసిరి పోలీసులను గాయపరిచారని ఆరోపించారు.
ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పందించారు. "చంద్రబాబుపై దాడి జరిగితే స్పందిస్తాం. లోకేశ్పై దాడి జరిగితే కూడా స్పందించాలా? లోకేశ్పై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలో, కడుపు మండిన వాళ్లో ఎవరికి తెలుసు? అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇలాంటి దాడులు జరగవు. మాజీ సీఎం కాబట్టి చంద్రబాబు హుందాగా ఉంటారు. చిల్లరగా ఉంటే... చిల్లరగానే ఉంటుంది" అంటూ బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.
Next Story