Sun Dec 22 2024 23:41:02 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Effect : నెల్లూరు వణుకుతోంది... తుపానుతో రెడ్ అలెర్ట్ జారీ చేసిన సర్కార్
బంగాళా ఖాతంలో ఏర్పడనున్న తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించారు
బంగాళా ఖాతంలో ఏర్పడనున్న తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అయితే ఈ నెల 17వ తేదీన తుపాను నెల్లూరు -చెన్నై మధ్య ద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నెల్లూరు జిల్లా వాసులు వణికిపోతున్నారు. నిన్న రాత్రి నుంచే నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఏ స్థాయిలో అంటే కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఇదే సమయంలో పాఠశాలలకు కూడా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
పాఠశాలలకు సెలవులు...
మరోవైపు 24 గంటల పాటు కంట్రోల్ రూంంలను కలెక్టర్ కార్యాలయంలో తెరిచి అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. అత్యంత వేగంగా తుపాను వస్తుందని భావిస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. అందుకే తుపాను తీరం దాటే సమయంలో విద్యుత్తు సరఫరాను కూడా నిలిపేయాలని అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. తుపానును ఎదుర్కొందుకు పక్కా ప్రణాళికలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రత్యేక వాహనాలను, అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో నిరంతరం ఉండాలని ఆదేశించారు.
పర్యాటక కేంద్రాల మూసివేత...
ఎలాంటి విపత్తును అయినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. తుపానుపై నిత్యం సమీక్షను ప్రతి రెండు గంటలకు ఒకసారి చేస్తున్నారు. మత్య్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. పర్యాటక కేంద్రాలను మూసివేశారు. పర్యాటక కేంద్రాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని, తుపాను తీరం దాటే సమయంలోనూ, తీరం దాటిన తర్వాత కుండపోత వర్షం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంతాల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఈసారి బలమైన గాలులతో పాటు భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story