Sat Nov 02 2024 21:20:30 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : జనసేన చేరికల వెనక ఉన్నది ఎవరు? వ్యూహం ప్రకారం జరుగుతుందా?
జనసేనలో వరస చేరికలు పార్టీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి.టీడీపీ కంటే చేరికలు ఎక్కువ కావడం అనుమానాలకు తావిస్తుంది
జనసేనలో వరస చేరికలు పార్టీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఎందుకంటే పదేళ్ల నుంచి లేని చేరికలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారన్నది గాజుగ్లాస్ పార్టీ ముఖ్యనేతలకు కూడా అర్థం కాకుండా ఉంది. గత పదేళ్లలో పదుల సంఖ్యలోనే నేతలుండేవారు. బలమైన క్యాడర్తో పాటు కాపు సామాజికవర్గం, పవన్ ఫ్యాన్స్ కారణంగా నేతలు చేరకపోయినా 2024 ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ వచ్చింది. 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలనే ఎంచుకుని, అందులోనే పోటీ చేసి అన్నింటిలోనూ గెలిచి పవన్ కల్యాణ్ పదేళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శకుల నోళ్లను మూయించగలిగారు.
అధికారంలోకి రాగానే...
కానీ అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండటం వెనక ఎవరున్నారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ సొంత నిర్ణయం కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ పెద్దగా చేరికలను ప్రోత్సహించరని అందరికీ తెలిసిందే. ఎందుకంటే పవన్ కు నాయకులకంటే అభిమానులు, ఓటుబ్యాంకు పైనే నమ్మకం ఎక్కువ. అలాంటి పవన్ కల్యాణ గత కొద్ది రోజుల నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక బలమైన కారణం లేకపోలేదన్న కామెంట్స్ జనసేన నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఏమైనా నేతలు ఎక్కువయితే మిగిలిన పార్టీల మాదిరిగా జనసేన తయారవుతుందేమోనన్న ఆందోళన పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతుంది.
ఈ నియోజకవర్గాల్లో...
ఇప్పటికే కొందరు నేతల చేరికకు పవన్ కల్యాణ్ ఓకే చెప్పారు. ఈ నెల 26వ తేదీన ముగ్గురు వైసీపీ నేతలను జనసేనలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లాకు చెందిన కిలారు రోశయ్య, కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసులురెడ్డిలు పార్టీలో చేరుతున్నారు. వీరంతా చేరితే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా కూడా మిత్రపక్షమైన టీడీపీని కాదని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారన్నది ప్రశ్న. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, ఒంగోలులో దామచర్ల జనార్థన్ రావు, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్యలు ముగ్గురూ టీడీపీకి చెందిన బలమైన నేతలు. వారు పార్టీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న వారు.
చేరికల ఓకే వెనక?
అలాంటి వారి నియోజకవర్గంలో వైసీపీ నేతలను పవన్ చేర్చుకుంటున్నారంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ చేరికల వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఆయన సూచనతోనే కొందరి నేతలకు పవన్ కల్యాణ్ ఓకే చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. వైసీపీని కొన్ని కీలక నియోజకవర్గాల్లో నిర్వీర్యం చేయాలంటే జనసేనలో వారిని చేర్చుకోవాలని చంద్రబాబు సూచన మేరకే ఈ చేరికలకు పవన్ కల్యాణ్ ఓకే చెప్పినట్లు అనుకుంటున్నారు. మరో వైపు తోట త్రిమూర్తులు వంటి వారి చేరికకు నో చెప్పడం కూడా ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తుంది. లేకుంటే ఈ సమయంలో పవన్ అంతటి నిర్ణయాలను తీసుకోరన్న టాక్ వినిపిస్తుంది. మరి జనసేన నేతలకు చేరికలపై పవన్ స్పష్టత ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story