Mon Dec 23 2024 09:33:46 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా కేసు : జగన్ పై సునీత ఆరోపణలు
ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణలో..
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దివంగత మంత్రివివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణలో సునీత స్వయంగా వాదనలు వినిపించారు. కోర్టు దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని సునీత పేర్కన్నారు.
అవినాష్ సీబీఐ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు విచారణకు రావాలని సీబీఐ నోటీసులిచ్చినా అవినాష్ స్పందించలేదని, ఆ తర్వాత తల్లికి బాలేదన్న సాకుతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారని సునీత సుప్రీంకోర్టుకు వివరించారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్లిన నేపథ్యంలో అతని మద్దతుదారులు అడ్డుకున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ అదే పనిగా బెదిరిస్తూ, ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాదు.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు వివేకా హత్య గురించి ముందే తెలుసని సునీత ఆరోపించారు. ఇదే విషయాన్ని అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా గతంలో సీబీఐ కూడా ప్రస్తావించింది. సునీత వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
Next Story