Sun Dec 22 2024 06:00:35 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Ladddu Controversy : ఇటు బాబు.. అటు జగన్.. తేల్చుకోలేక సమయం కోరారా?
తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది
తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. సొలిసటర్ జనరల్ తుషార్ మెహతా తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరడంతో రేపటికి విచారణను వాయిదా వేశారు. విచారణను రేపు ఉదయం 10.30 గంటలకు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే వాయిదా పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక తన అభిప్రాయాన్ని చెప్పలేకపోవడమేనని తెలుస్తుంది. అందుకే సొలిసటర్ జనరల్ తుషార్ మెహతా తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరినట్లు న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇద్దరి అవసరం...
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే ఇటు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలూ ఉన్నాయి. మరో వైపు జగన్ సహకారం కూడా పెద్దల సభలో అవసరం అవతుంది. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పటికీ మరో ఎనిమిది సభ్యులు వైసీపీకి ఉన్నారు. అనేక కీలమైన బిల్లుల విషయంలో జగన్ మద్దతు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అవసరమవుతుంది. ఒకవైపు ఇటు కూటమిలో భాగస్వామి, మరొక వైపు తమకు మద్దతు అవసరమైన జగన్ కూడా ఉండటంతో అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం అవసరమని భావించిందని రాజకీయ వర్గాలు సయితం అభిప్రాయపడుతున్నాయి.
రేపటికైనా నిర్ణయం వస్తుందా?
దీంతో పాటు తిరుమల లడ్డూ వ్యవహారం ఆషామాషీ కాదు. దేశంలోనే కాదు, ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల మనోభావాలపై తమ నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుందని బీజేపీ కొంత డైలమాలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు అప్పగిస్తే దాని నివేదిక నిజానిజాలు ప్రజలు నమ్మే అవకాశముండదన్న భావనలో కేంద్రంలోని పెద్దలు ఉన్నారని తెలిసింది. మరో వైపు ఇటు చంద్రబాబు మద్దతు కూడా అవసరం. ఆయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఊగిసలాట మధ్య సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయం చెప్పేందుకు సమయం అవసరమని భావించినట్లుందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
Next Story