Fri Nov 22 2024 14:48:29 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Laddu Controversy : అద్గదీ విషయం... అసలు నిజం ఇప్పుడు తేలుతుంది?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. దీంతో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా? లేదా? అన్నది ఇక తేలనుంది. ఐదుగురు స్వతంత్ర సభ్యులతో కూడిన దర్యాప్తు చేయాలని తేలింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ కార్యాలయం నుంచి ఒకరు ఈ దర్యాప్తు చేయనున్నారు. సీబీఐ డైరెక్టర్ ఇద్దరు అధికారులను నియమించనున్నారు. ఈదర్యాప్తునకు ఎలాంటి నిర్దిష్ట సమయం సుప్రీంకోర్టు సూచించలేదు.దర్యాప్తు పూర్తయిన తర్వాత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివాదంపై రాజకీయ నేతలు మాట్లాడవద్దని సుప్రీం సూచించింది. లడ్డూను రాజకీయం చేయవద్దని కోరింది.
కొద్ది రోజులుగా రచ్చ...
తిరుమల లడ్డూ పై దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతుంది. ఏఆర్ డెయిరీపై కేసు కూడా నమోదయింది. దీంతో పాటు కల్తీ జరిగిందని కూటమి పార్టీలు ఆరోపిస్తుండగా, కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ వివాదం మరీ పీక్ కు చేరింది. ఏ స్థాయికి అంటే కల్తీ విషయంలో ప్రమాణాలకు కూడా సిద్ధమవుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలయితే కల్తీ జరిగిందని నిరూపణ జరిగితే తాము ఏ శిక్ష కైనా సిద్ధమని ప్రకటించారు. కల్తీ జరిగినట్లు తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఆయన ప్రమాణం కూడా చేశారు.
స్వతంత్ర దర్యాప్తునకు...
ఒక్క రూపాయిని కూడా టీటీడీ నుంచి తాము దారి మళ్లించలేదని చెప్పారు. మరో వైపు నారా లోకేష్ కూడా ప్రమాణానికి తాను సిద్ధమని ప్రకటించారు. నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కల్తీ జరిగిందని తేల్చేశారు. దీంతో ఈ వివాదానికి త్వరగా చెక్ పడాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరుగుతుంది. నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? లేదా? అన్నది ఈ దర్యాప్తులో ఖచ్చితంగా తేలనుంది. ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా ఉండటంతో వ్యవహారం తేలనుంది. లడ్డూ ప్రసాదంలో ఈ కల్తీ నెయ్యిని వినియోగించారా? లేదా? అన్న దానిపైనే ప్రధానంగా దర్యాప్తు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇప్పటి వరకూ సేకరించిన దర్యాప్తు వివరాలను సేకరించి త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు సూచనలతో ఈ వివాదంపై రాజకీయ నేతల నోళ్లుమూత బడినట్లే.
Next Story