Mon Dec 02 2024 13:27:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జేసీ ఓటమిని అంగీకరిస్తారా? రాజీకి వచ్చే పరిస్థితి లేదా?
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి . కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్టు విషయంలో ఆయన వెనక్కుపోవడం లేదు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్టు విషయంలో ఆయన వెనక్కుపోవడం లేదు. తాను తప్పు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకోసమే పార్టీ అధినేత చంద్రబాబు వార్నింగ్ లను కూడా పెద్దగా పట్టించుకోనట్లే కనపడుతుంది. తన అనుచరులకు దక్కాల్సిన కాంట్రాక్టులను వేరే వాళ్లు ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, ఎంత వరకైనా వెళతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ ఎగుమతులపై ఇంకా రాయలసీమ జిల్లాలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
నేతల మధ్య వివాదం...
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మల మడగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య పంచాయతీ తెగేటట్లు కనిపించడం లేదు. కడప జిల్లాలో ఆర్టీపీపీ ఉండగా, సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం జేసీ ఇలాకాలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా తాడిపత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు ఫ్లైయాష్ కాంట్రాక్టులను పంచుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇద్దరూ బలమైన వారు కావడంతో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. తమ అనుచరుల కోసమేనని చెబుతున్నప్పటికీ ఫ్లైయాష్ తో భారీ ఆదాయం వస్తుండటంతో దానిని వదులుకునేందుకు ఇద్దరు నేతలు సిద్ధంగా లేరు. ఒకరు టీడీపీకాగా, మరొకరు బీజేపీ నేతగా ఉన్నారు.
ఇద్దరూ ససేమిరా అంటుండటంతో...
ఇద్దరూ ససేమిరా అంటుండటంతో ఎవరినీ కాదనలేక పార్టీ నాయకత్వం ఇబ్బందులు పడుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు. గత ఐదేళ్లలో తనపై అనేక కేసులు నమోదయ్యాయని, అరెస్ట్ అయ్యానని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనపై ఈ ఆంక్షలేంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. ఎవరికి వారే కాంట్రాక్టు తమకే కావాలని పట్టుబడుతుండటంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. జేసీ ప్రబాకర్ రెడ్డి మాత్రం తాను చంద్రబాబు అంత మంచి వాడిని కాదంటూ హెచ్చరికలు ప్రత్యర్థులకు పంపుతూనే ఉన్నారు. మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారే అవకాశముందని చెబుతున్నారు.
Next Story