Mon Dec 23 2024 05:51:59 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రికి పాకిన కరపత్రాల గోల
ఆ కరపత్రాలలో తాడిపత్రిలో బోకులు, బోలెలు ఎక్కడ ఉన్నాయి పెద్దారెడ్డి? అని.. తాడిపత్రి మండలంలో 10 రోజులు ఆలస్యంగా ఎందుకు పాదయాత్ర చేశావో చెప్పు
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కరపత్రాలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. పలు నియోజవర్గాల్లో ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా వస్తున్న కరపత్రాలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. తాజాగా తాడిపత్రిలో కూడా కరపత్రాలు కలకలం రేపాయి. మూడో విడత ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గన్నెవారి పల్లి కాలనీలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి వ్యతిరేకంగా కరపత్రాలు స్థానికంగా కలకలంగా మారాయి.
ఆ కరపత్రాలలో తాడిపత్రిలో బోకులు, బోలెలు ఎక్కడ ఉన్నాయి పెద్దారెడ్డి? అని.. తాడిపత్రి మండలంలో 10 రోజులు ఆలస్యంగా ఎందుకు పాదయాత్ర చేశావో చెప్పు పెద్దారెడ్డి? అని విమర్శించారు. అలాగే తాడిపత్రి ప్రాంతంలో చెట్ల నరికివేతకు బ్రాండ్ అంబాసిడర్ కేతిరెడ్డి కుటుంబం కాదా? అని కరపత్రాలలో విమర్శించారు. ఈ పని చేసింది జేసీ వర్గమే అని తెగ చెవులు కొరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. అందులో ‘‘రోజూ జేసీ సోదరులను తలచుకోకుంటే నీకు నిద్ర పట్టదు పెద్దారెడ్డి’’ అని ప్రశ్నించారు. దోచుకోవడం గురించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడితే బాగుండదని.. ప్రజల కోసం ఏం చేశారనేది చెప్పుకునేందుకు ఆయన చేసింది ఏమి లేదని కరపత్రాల్లో విమర్శించారు.
కరపత్రాలను గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ పని చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు గెలవరని భావించి, ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై చర్చ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కరపత్రాల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తాడిపత్రిలో కరపత్రాల పంపిణీ గురించి అలర్ట్ అయిన పోలీసులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కరపత్రాలను ఎవరు వేశారు అన్నదానిపై విచారణ జరిపారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పెద్దారెడ్డిపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసినందుకు నలుగురు టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదు చేశామని పట్టణ, రూరల్ పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన పెద్దన్న, వెంకటేశ్, రూరలకు చెందిన శేఖర్, సుబ్రహ్మణ్యంపై కేసు నమోదుచేసి, పూచీకత్తుపై విడుదల చేశామని తెలిపారు.
Next Story