Tue Apr 08 2025 09:15:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇక వరసగా హామీల అమలు..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. క్యాలెండర్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. వరసగా హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఇక సూపర్ సిక్స్ హామీల అమలు నెలకొకటి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి పెరిగింది. కేవలం రాజధాని నిర్మాణాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ గోడును పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక నేతల వద్ద కూడా ప్రజలు ఇదేరకమైన అభిప్రాయాన్ని వెళ్ల గక్కతుండటంతో ఇక వరసగా హామీలు అమలు చేయాలని నిర్ణయించారు.
ఉచిత బస్సు ప్రయాణం...
ముందుగా మార్చి నెల నుంచి అంటే ఉగాది నాటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరించే పద్థతులను అథ్యయనం చేసి వచ్చిన మంత్రుల కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేస్తే పెద్దగా భారం పడదని నివేదికలో పేర్కొనడంతో ఆ దిశగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉగాది రోజు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏప్రిల్ నెలలో...
మరోవైపు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నా వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా ఇప్పటికే క్లారిటీకి వచ్చారు. ఆధార్ కార్డుతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన లబ్దిదారుల జాబితాను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఎంత మంది ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పడంతో అది మరింత భారం కాకుండా కొన్ని నిబంధనలు రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అన్నదాత సుఖీభవ...
మరో ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి పార్టీల మ్యానిఫేస్టోలో కూడా పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మూడు విడతలుగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి విడత నిధులను మే నెలలో ఇచ్చేందుకు అవసరమయిన నిధులను సిద్ధంచేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. దీంతో వరసగా మార్చి, ఏప్రిల్ మే నెలల్లో తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. బడ్జెట్ లో కూడా వీటికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.
Next Story